11 గ్రామాల్లో భూ సమీకరణకు ప్రభుత్వం కసరత్తు – అమరావతి విస్తరణకు కీలక అడుగు
Amravati Amaravati 23 Aug 2026

అమరావతి: రాజధాని అమరావతి విస్తరణలో భాగంగా మరోసారి భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మూడో దశలో సుమారు 50 వేల ఎకరాల భూమిని సమీకరించే లక్ష్యంతో కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే లైన్, ఇంటర్నల్ రింగ్ రోడ్డు వంటి కీలక మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన భూములను సమీకరించనున్నారు.
ఇప్పటికే తాడికొండ మండలంలోని మోతడక గ్రామంలో 2,344 ఎకరాల భూమి సమీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రావెల ప్రాంతంలో ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయం కోసం సుమారు 4,600 ఎకరాల భూమిని సమీకరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి సాధ్యాసాధ్యాల నివేదిక (Feasibility Report) కూడా సిద్ధమైనట్లు సమాచారం.
ప్రస్తుతం మొత్తం 11 గ్రామాల్లో భూ సమీకరణ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత గ్రామాల్లో ఇప్పటికే గ్రామసభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలను సేకరించారు. భూములు స్వచ్ఛందంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రైతుల వివరాలను జిల్లా యంత్రాంగం ద్వారా సీఆర్‌డీఏకు పంపించినట్లు తెలుస్తోంది.
భూ సమీకరణ చేపట్టనున్న గ్రామాల్లో మోతడక, తాడికొండ, కంతేరు, రావెల, బండారుపల్లి, బేజాత్‌పురం, పొన్నెకల్లు, లచ్చన్నగుడిపూడి, మందపాడు తదితర గ్రామాలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఇతర ప్రాంతాల్లో కూడా భూములను సమీకరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం ఈ భూములను అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే కనెక్టివిటీ, ఇంటర్నల్ రింగ్ రోడ్డు, భవిష్యత్ రాజధాని అభివృద్ధి ప్రాజెక్టుల కోసం వినియోగించనున్నారు. భూ సమీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రామాల వారీగా భూమి వివరాలు (హెక్టార్లలో)
మోతడక – 949
తాడికొండ – 5,179.44
కంతేరు – 1,486
రావెల – 1,460
బండారుపల్లి – 1,930
బేజాత్‌పురం – 1,342
పొన్నెకల్లు – 1,546
లచ్చన్నగుడిపూడి – 1,208
మందపాడు (మేడికొండూరు) – 791.44
